Monday, August 6, 2007

శంకర్ దాదా జిందాబాద్ విశ్లేషణ- by Raju




శంకర్ దాదా ఎంబిబిస్ ఘన విజయం తర్వాత చిరు తనదైన స్టైల్ కలగలిసిన కామెడీతో ప్రేక్షకులకి వీనుల విందు చేస్తాడు. దేశభక్తి నేపథ్యంగా ఈ మధ్య వచ్చిన సినిమాలు తక్కువే. ఈ సినిమా ప్రధాన నేపధ్యం అదే కాకున్నా గాంధీ స్వతంత్ర పోరాటంలో ప్రధాన అస్త్రాలైన సత్యం, అహింసలని గాంధిగిరి ద్వారా ప్రజలకి చేరువ చేయడంలో మెగాస్టార్ని మించిన వారెవ్వరు. అయితే ఈ గాంధీగిరి ఏ మేరకు ప్రజానీకానికి దగ్గరవుతుందో చూడాలి. కానీ ప్రజలని ఆలోచింపజేసే సత్తా ఏ మేరకు ఉందో తెలియజెప్పే సమగ్ర విశ్లేషణ ఈ వ్యాసం.


ఇక ఒరిజినల్ మున్నాభాయ్ విషయానికొస్తే ఆ సినిమాకి సంజయ్ దత్ డైలాగులే ఆయువుపట్టు. గాంధీగిరీని రేడియో ద్వారా ప్రచారం చేసేటప్పుడు కూడ మున్నాభాయ్ తన యాస డైలాగులతోనే శ్రోతలకి దగ్గరవుతాడు. ఇక తెలుగు కథలో ప్రధానంగా లోపించింది అదే. శంకర్ దాదాMBBS విషయానికే వస్తే చిరు తన మార్కు ఇంగ్లీష్ టు తెలుగు కాపి డైలాగులతో మనల్ని అలరిస్తాడు. అది చాల బాగా క్లిక్ అయ్యింది. కానీ తాజా విడుదలలో ఏ క్షణంలో కూడ తన దాదాగిరిని సంభాషణల్లో వల్లె వేయడు. ఇది తప్పకుండా రచయితల వైఫల్యమే. ఇంకా చెప్పాలంటే శంకర్ దాదాకు ఒక దాదాకుండాల్సిన లక్షణాలకంటే హీరోకుండాల్సిన లక్షణాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఒక సినిమా విజయానికి కావల్సింది పాత్ర కథలో ఒదిగిపోవడమే అయితే ఇక్కడ పాత్ర చిత్రణలోనే ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇక్కడ దర్శకుని అనుభవలేమి బయటపడింది.


పాత్రల విషయానికొస్తే హిందీ గాంధిజీయే తెలుగులో కూడా కనిపిస్తాడు. గాంధీజిని చిత్రీకరించేటప్పుడు మేకప్ లోపాలు స్పష్టంగా తెరపై కనిపిస్తాయి. ఇది నాసిరకం ఫొటొగ్రఫి మహిమే. హిందీ గాంధీజి తెలుగులో ప్రవచనాలు చెప్పేటప్పుడు వినసొంపుగా ఉండవు, డబ్బింగ్ ఆర్తిస్టులే కరవైనట్టు హింది గాంధీజి చేతే డైలాగులు చెప్పించడం వల్ల కథలో నేటివిటి మిస్ అయింది.
ఇంకా హీరోయిన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలో "కింగ్ ఫిషర్ బిక్నిగర్ల్"కరిష్మ కోటక్ చిరు ముందు వెలవెల బోయింది. హీరోయిన్ని దగ్గరగా చూపించిన సందర్బాలు చాలా తక్కువ. గ్లామర్ పాత్ర కాకపోవడంతో అందాల ప్రదర్శనకి కూడా అవకాశం లేకుండా పోయింది.

సినిమాలో శ్రీకాంత్ ఒక్కడే పాత్రకి తగిన న్యాయం చేసాడు. రెండున్నర గంటలు చిరుని చూడటమే పండగలా భావించే అభిమానులకు పవన్ కళ్యాణ్, రవితేజ , అల్లు అర్జున్ ల మెరుపు రాక పంచభక్ష పరమాన్నమే. కానీ చివరలో పవన్ కళ్యాణ్ చెప్పే అనవసర డైలాగులు అభిమానులతో ఈలలు వేయిస్తాయేమో గాని సగటు ప్రేక్షకునికి రుచించవు. ఆ సన్నివేశంలో పవన్ చెప్పే ఎమోశ్నల్ డైలాగ్స్,చేసే ఫైట్ వల్ల చిరు సినిమా మొత్తం నెత్తీ నోరు బాదుకొని చెప్పిన సత్యం-అహింసా కాలరాసిపోయాయి.

దేశం మొత్తం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా మన రాష్ట్రంలో ప్రేక్షకులని మెప్పించలేదంటే అది ఆడియన్సు దౌర్భాగ్యమే కాని అభిమానులు కట్టిన ఊహల సౌధల్లో విహరించే హీరోలదీ కాదు, దర్శకులదీ కాదు రచయితలది అంతకంతే కాదు.


Thanks a lot for your immense patience and checking till the bottomline...
Please drop a comment